Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఫిలిప్పీయులకు1వఅధ్యాయము

1  ఫిలిప్పయిలో ఉన్న క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమొథెయును (శుభమని చెప్పి) వ్రాయునది. 
2  మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. 
  3-6. మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దాని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్ధనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్ధనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
7  నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దాని స్థిరపరచుటయందును, మీరందరు ఈకృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. 
8  క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి. 
  9-11. మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ, తెలివితోను సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులను కావలెననియు ప్రార్థంచుచున్నాను. 
12  సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే పరిణమించెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. 
13  ఏలాగనగా నా బంధకములు క్రీస్తునిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోనివారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను. 
14  మరియు సహోదరులైనవారిలో ఎక్కువమంది నా బంధకములమూలముగా ప్రభువునందు స్థిరవిశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి. 
  15-17. కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరి కొందరు మంచిబుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడి యున్నానని యెరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. 
18  అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనేగాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. 
19  మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైన సరే చావు మూలముగానైన సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని 
20  నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్ధనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. 
21  నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. 
22  అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. 
23  ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశ యున్నది, అది నాకు మరి మేలు. 
24  అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. 
  25-26. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసియుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును. 
  27-28. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏకమనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. (అట్లు మీరు బెదరకుండుట) వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే. 
29  ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున 
30  క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. 
      Download Audio File

ఫిలిప్పీయులకు2వఅధ్యాయము

1  కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఏ దుఃఖోపశమనమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసవాత్సల్యములైనను ఉన్నయెడల 
2  మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమకలిగి, యేకభావముగలవారుగా ఉండి, ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణముచేయుడి. 
3  కక్షచేతనైనను వృధాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు 
4  మీలో ప్రతివాడును తన స్వకార్యములనుమాత్రమేగాక యితరుల కార్యములనుకూడా చూడవలెను. 
5  క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. 
6  ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని. 
7  మనుష్యుల పోలికగాపుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. 
8  మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయతచూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 
  9-10. అందుచేతను పరలోకముందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమునవంగునట్లును, 
11  ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 
12  కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్నప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ స్వరక్షణను కొనసాగించుకొనుడి. 
13  ఈ విషయములో మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలోకార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. 
  14-15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని సమస్త కార్యములనుచేయుడి. 
16  అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. ఇందువలన నేను వ్యర్ధముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును. 
17  మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషంతును. 
18  ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. 
19  నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుచుకొను నిమిత్తము తిమొథెయును శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. 
20  మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతనివంటివాడెవడును నాయొద్ద లేడు. 
21  అందరును తమ స్వకార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. 
22  అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవచేసెను. 
23  కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతని పంపవలెనని అనుకొనుచున్నాను. 
24  శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ముచున్నాను. 
25  మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోటియోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. 
26  తాను రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని (చూడ) మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. 
27  నిజముగా అతడు రోగియై చావుకు సిద్ధమై యుండెను గాని దేవుడతని కనికరించెను; అతని మాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. 
28  కాబట్టి మీరు అతని చూచి మరల సంతోషించునిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గునిమిత్తమును అతని మరి శీఘ్రముగా పంపితిని. 
  29-30. అతడు నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్కపనినిమిత్తము చావుకు సిద్ధమైయుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. 
       Download Audio File

ఫిలిప్పీయులకు3వఅధ్యాయము

1  మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుటనాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. 
2  కుక్కలవిషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారివిషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదననాచరించువారివిషయమై జాగ్రత్తగా ఉండుడి. 
3  శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి (ఆచరించువారము. ) 
4  కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. 
5  ఎనిమిదవదినమున సున్నతిపొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతైనమైన హెబ్రీయుడనే, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, 
6  ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని. 
7  అయినను ఏవేవినాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 
8  నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 
9  క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతికాక క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడునిమిత్తమును, 
  10-11. ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్ధానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్ధానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదోయెరుగునిమిత్తమును, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 
12  ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణసిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తుయేసుచేత పట్టబడితినో దాని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. 
13  సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి (చేయుచున్నాను), వెనుక ఉన్నవి లక్ష్యపెట్టకముందట ఉన్నవాటికొరకై వేగిరపడుచు 
14  క్రీస్తుయేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను, 
15  కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యముకలిగియున్నయెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. 
16  అయినను ఇప్పటివరకు మనకు లభించినదానినిబట్టియే క్రమముగా నడుచుకొందుము. 
17  సహోదరులారా, మీరు నన్నుపోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొనువారిని గురిపెట్టి చూడుడి. 
18  అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు;వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. 
19  నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు; వాకు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటినే మనస్కరించుచున్నారు. 
20  మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడినుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. 
21  సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. 
       Download Audio File

ఫిలిప్పీయులకు4వఅధ్యాయము

1  కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. 
2  ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. 
3  అవును, నిజమైన సహకారీ, ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయముచేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేరులు జీవగ్రంధమందు వ్రాయబడియున్నవి. 
4  ఎల్లప్పుడును, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును, ఆనందించుడి. 
5  మీ సహనమునుసకలజనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. 
6  దేనిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 
7  అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 
8  మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. 
9  మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. 
10  నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని, ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. 
11  నాకు కొదువకలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తికలిగియుండ నేర్చుకొనియున్నాను. 
12  దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్నస్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్నికార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలోఉండుటకును నేర్చుకొని యున్నాను. 
13  నన్ను బలపరచువానిబట్టియేనేను సమస్తమును చేయగలను. 
14  అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. 
15  ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మకెదొనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును. 
16  ఏలయనగా ధెస్సలొనీకేలోకూడ మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. 
17  నేను మీ యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీలెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. 
18  నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి. 
19  కాగా నా దేవుడు తన ఐశ్వర్యముచొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసమును తీర్చును. 
20  మన తండ్రియైన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్ 
21  ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి. 
22  నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు. 
23  ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.