Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఫిలిప్పీయులకు1వఅధ్యాయము

1  ఫిలిప్పయిలో ఉన్న క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమొథెయును (శుభమని చెప్పి) వ్రాయునది. 
2  మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. 
  3-6. మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దాని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్ధనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్ధనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
7  నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దాని స్థిరపరచుటయందును, మీరందరు ఈకృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. 
8  క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి. 
  9-11. మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ, తెలివితోను సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులను కావలెననియు ప్రార్థంచుచున్నాను. 
12  సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే పరిణమించెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. 
13  ఏలాగనగా నా బంధకములు క్రీస్తునిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోనివారికందరికిని తక్కినవారికందరికిని స్పష్టమాయెను. 
14  మరియు సహోదరులైనవారిలో ఎక్కువమంది నా బంధకములమూలముగా ప్రభువునందు స్థిరవిశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి. 
  15-17. కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరి కొందరు మంచిబుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడి యున్నానని యెరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. 
18  అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనేగాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. 
19  మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగానైన సరే చావు మూలముగానైన సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని 
20  నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్ధనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. 
21  నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. 
22  అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. 
23  ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశ యున్నది, అది నాకు మరి మేలు. 
24  అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. 
  25-26. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసియుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును. 
  27-28. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏకమనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. (అట్లు మీరు బెదరకుండుట) వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే. 
29  ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున 
30  క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. 
      Download Audio File

No comments:

Post a Comment