Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఫిలిప్పీయులకు4వఅధ్యాయము

1  కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. 
2  ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. 
3  అవును, నిజమైన సహకారీ, ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయముచేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేరులు జీవగ్రంధమందు వ్రాయబడియున్నవి. 
4  ఎల్లప్పుడును, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును, ఆనందించుడి. 
5  మీ సహనమునుసకలజనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. 
6  దేనిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 
7  అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 
8  మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. 
9  మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. 
10  నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని, ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. 
11  నాకు కొదువకలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తికలిగియుండ నేర్చుకొనియున్నాను. 
12  దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్నస్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్నికార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలోఉండుటకును నేర్చుకొని యున్నాను. 
13  నన్ను బలపరచువానిబట్టియేనేను సమస్తమును చేయగలను. 
14  అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని. 
15  ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మకెదొనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును. 
16  ఏలయనగా ధెస్సలొనీకేలోకూడ మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. 
17  నేను మీ యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీలెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. 
18  నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి. 
19  కాగా నా దేవుడు తన ఐశ్వర్యముచొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసమును తీర్చును. 
20  మన తండ్రియైన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్ 
21  ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి. 
22  నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు. 
23  ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. 

No comments:

Post a Comment